
చెరువులో మునిగి బీటెక్ విద్యార్థి మృతి
నర్సాపూర్ రూరల్: చెరువులో మునిగి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన నర్సాపూర్ రాయరావు చెరువులో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ లింగం కథనం మేరకు.. హైదరాబాద్‌లోని గాజుల రామారానికి చెందిన మనీశ్(19) వీఎన్‌ఆర్ కళాశాలలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. ముందే స్నేహితులతో వేసుకున్న ప్లాన్ ప్రకారం అతడి మిత్రులు హరి శంకర వర ప్రసాద్, ప్రియాకర్, కౌటిల్య, సంజయ్, సాత్విక్, రాగ, తన్వి మొత్తం 8 మంది కలిసి నర్సాపూర్ రాయరావు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ కట్టపై ఉన్న పార్కులో కాలక్షేపం చేసి అనంతరం మధ్యాహ్నం చెరువు తూము వద్ద ఉన్న మెట్లపై నుంచి నీటి అంచుకు చేరుకున్నారు. మెట్లపై నుంచి నీటిలో కాళ్లు పెట్టి సరదాగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మనీశ్ నీటిలో పడిపోయి మునిగిపోయాడు. మిత్రుడు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సాయంతో మనీశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. రాయరావు చెరువు వద్దకు వచ్చి కాలక్షేపంతోపాటు విద్యార్థులు మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కాలక్షేపం కోసం నర్సాపూర్ వచ్చిన 8 మంది విద్యార్థులు
కాళ్లు కడుక్కుంటుండగా నీట మునిగి మృత్యువాత
మృతుడిది హైదరాబాద్‌లోని గాజుల రామారం