
హెచ్‌సీయూ భూములు అమ్మొద్దు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములు అమ్మొద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను సీఎం రేవంత్‌రెడ్డి రియల్ వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు అమ్మేందుకు చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయడం విచారకరమన్నారు. ఒక చెట్టు కొట్టాలంటే తహసీల్దార్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా రాత్రికి రాత్రి యూనివర్సిటీ భూముల్లో వందలాది చెట్లను నరికి వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విదేశీ మహిళపై, రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై అఘాయిత్యాలు జరిగాయని, రోజు ఇలాంటి దుర్ఘటనలు జరగడం సర్వసాధరణమైయ్యాయని ఆమె వివరిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
నేడు మంత్రి దామోదర రాక
మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నర్సా పూర్ రానున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తా రని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు సత్యంగౌడ్, నర్సింలు, ప్రసాద్, సుధాకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, పాష, తదితరులు పాల్గొన్నారు.