
విష ప్రయోగమా.. ఆత్మహత్యా..?
● వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి
● మంత్రాల నెపంతో ఊరు వదిలిన వైనం
● ఏడాది నుంచి వ్యవసాయ క్షేత్రం వద్ద నివాసం
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ మధు, రూరల్ సీఐ శ్రీను
నంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ బావి వద్ద నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరులో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల కొమురయ్య (80), భూదవ్వ(70) దంపతులు. వీరికి మంత్రాలు వస్తాయనే అనుమానంతో ఏడాది కిందట గ్రామంలో గొడవ జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న గదిలో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారు జామున వారి కుమారుడు పరుశరాములు వచ్చి చూడగా.. తలుపు గడియ పెట్టి ఉండడంతో దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. తల్లిదండ్రులిద్దరూ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సిద్దిపేట ఏసీపీ మధు, రూరల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ ఆసిఫ్ సంఘటన స్థలంలో మృతదేహాలను పరిశీలించారు. కుమారుడు పర్షరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
విష ప్రయోగం చేశారా..?
వ్యవసాయం క్షేత్రం వద్ద ఉంటున్న కొమురయ్య, భూదవ్వ దంపతులపై మంత్రాలు చేస్తారనే అభియోగం ఉంది. ఏడాది నుంచి గ్రామంలోకి రా కుండా వ్యవసాయ క్షేత్రం వద్దే ఉంటున్నారు. తల్లిదండ్రులకు కుమారుడు పరుశరాములు ప్రతి రోజు ఇంటి నుంచి భోజనం తెచ్చి ఇస్తున్నాడు. ఒకే రోజు వృద్ధ దంపతులు మృతి చెందడం, శరీరంపై ఎలాంటి గాయాలు, పెనుగులాడిన ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోజనంలో విషం కలిపి చంపారా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

విష ప్రయోగమా.. ఆత్మహత్యా..?

విష ప్రయోగమా.. ఆత్మహత్యా..?