
దూరం పెట్టిందని మట్టుబెట్టాడు
జహీరాబాద్ టౌన్: కొంత కాలం సహజీవనం సాగించిన తర్వాత దూరం పెట్టిందని కక్షతో మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. శుక్రవారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఝరాసంగం మండలం చిలేమామిడికి చెందిన లక్ష్మి(40)కి భర్త లేడు, ఉపాధి కోసం పట్టణానికి వచ్చి పస్తాపూర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కోహీర్ మండలం గొటిగార్‌పల్లికి చెందిన సత్యారం రమేష్(26)కు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. రమేష్ ప్రవర్తన నచ్చక దూరం పెట్టింది. అప్పటి నుంచి ఆమైపె కక్ష పెంచుకున్నాడు. తనను దూరం పెట్టి మరొకడితో ఉంటుందన్న కోపంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు. మార్చి 29న రమేష్ కల్లుతాగి లక్ష్మికి ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న పెంట్రోల్‌ను పోసి నిప్పు పెట్టాలని చూశాడు. గట్టిగా కేకలు వేయడంతో పక్కింటి మహిళా మరియమ్మ పరుగెత్తుకుంటూ రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అదేనెల 31న ఉదయం రమేష్ మళ్లీ ఆమె ఇంటికి వెళ్లి బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కళ్లలో కారం చల్లి గ్యాస్ సిలిండర్ తీసుకుని తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతురాలి సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. శుక్రవారం హైదరాబాద్ పారిపోవడానికి ఆర్టీసీ బస్డాండ్‌కు రాగా నిందితుడిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశామన్నారు. నిందితుడిని సకాలంలో పట్టుకున్న సీఐ.శివలింగం, ఎస్‌ఐ.కాశీనాథ్, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్టు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ