
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
సిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపాలన అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని ఆయన వివరించారు.
రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి
భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రెటరీ పూల్‌సింగ్, టీ జీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, సీసీఎల్‌ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణచైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
భూభారతితో రైతులకు మెరుగైన సేవలు
త్వరలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి
శుభవార్త
తెలంగాణ ఉద్యోగుల
జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ
ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం