
ఆట పూట మారిందోచ్
సంగారెడ్డిలో వెలుస్తున్నబాక్స్ గ్రౌండ్‌లు
● ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఆటలు ● ఆసక్తి చూపుతున్న యువత, ఉద్యోగులు ● అన్ని వయస్సుల వారు ఇష్టంగా ఆడుతున్న క్రికెట్ ● ఆట సమయాన్ని బట్టి ధరలు ● రూ.లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటుచేస్తున్న నిర్వాహకులు ● అన్ని క్రీడలకు అవకాశం
రాత్రిపూట క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులు
సంగారెడ్డి టౌన్: మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఖాళీ సమయం దొరికితే చా లు క్రికెట్ ఆడుతుంటారు. అప్పట్లో ఆటలు ఆడేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద పెద్ద మైదానాలు ఉండేది. కానీ రాను రానూ గ్రామాలతో పాటు పట్టణాల్లో స్థలాల విలువ పెరగడం ఆట స్థలాలు లేకుండా పోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మైదానాలు కనుమరుగవుతుండటంతో పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ప్రతీ పిల్లవాడి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. యూట్యూబ్ చూడటం, ఫోన్ లోనే ఆటలు ఆడడమే తప్ప శరీరానికి ఉపయోడపడే ఆటలు ఆడటం మరచిపోయారు. దీన్ని దృష్టిలో సంగారెడ్డిలో కొందరు అన్ని వసతులు, ఆహ్లాదకర వాతావరణంలో బాక్స్ క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ వెసులుబాటు ఉండేలా నిర్మాణాలు చేపట్టారు.
క్రికెట్‌కు ప్రత్యేకంగా కోచింగ్
ప్రస్తుతం వేసవి కావడం, ఇంటర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు రావడం, ఒంటిపూట బడులు ఉండటంతో ఇప్పడూ ఎక్కడ చూసిన క్రికెట్ సందడి నెలకొంది. దీంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో క్రికెట్‌కు ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చేందుకు నెట్ ప్రాక్టీస్ శ్రీకారం చుట్టారు. ఉదయం, సాయంత్రం వేళలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో కోచింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డితోపాటు పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో బాక్స్ క్రికెట్‌లు ఏర్పాటు చేశా రు. తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను సా యంత్రం వేళల్లో కోచింగ్ ఇప్పించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యోగులు తమ పిల్లలకు శిక్షణ ఇప్పించేందుకు సమయం వెచ్చిస్తున్నారు.
వీకెండ్లలో యువకులు పెద్ద ఎత్తున
సంగారెడ్డితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వీకెండ్లలో యువకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. నర్సాపూర్, జోగిపేట్, శివ్వంపేట్, తదితర గ్రామాల నుంచి క్రీడాకారులు డాక్టర్లు, ఉద్యోగులు, క్రికెట్‌తోపాటు వివిధ ఆటలు ఆడడానికి వస్తుంటారు. సాయంత్రం వేళలో సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్‌లను ముందుగా బుకింగ్ చేసుకొని ఆటలు ఆడుతుంటారు. వీకెండ్లలో స్నేహితులందరూ ఒకచోట చేరి క్రికెట్ ఆడుతుంటారు. జిల్లా అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు సాయంత్రం వేళల్లో ఆడటానికి ఆసక్తి చూపుతున్నారు.
12 బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌లు
సంగారెడ్డి చుట్టపక్కల సుమారు 12 బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లు ఉన్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో రాత్రి 11 వరకు ఉదయం 5 నుంచి 7 వరకు ఆడుతున్నారు. బాక్స్ క్రికెట్ లో చుట్టూ నెట్ ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్‌లో కింద గ్రీన్ మ్యాట్‌తో ఉంటుంది. ప్రతీ క్రికెట్ ఆటకు నెలకు రూ.700 నుంచి రూ.900, వాలీబాల్‌కు రూ. 600 నుంచి రూ.750 ఒక ఆటకు, స్నూకర్ రూ.150 నుంచి 250, బ్యాడ్మింటన్ రూ.250 నుంచి రూ.300 ధరలు ఉన్నాయి.

ఆట పూట మారిందోచ్