
అదుపుతప్పి గూడ్స్ ఆటో బోల్తా
ఇద్దరికి తీవ్ర గాయాలు
కొండపాక(గజ్వేల్): అదుపుతప్పి గూడ్స్ ఆటో బోల్తా పడిన ఘటన కొండపాక గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ కాజీపేట నుంచి ఆయిల్ ప్యాకెట్లను లోడ్ చేసుకొని గూడ్స్ ఆటో హైదరాబాద్‌లోని నాగోల్‌కు వెళ్తుంది. కొండపాక శివారులోని మెదక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అదుపుతప్పి రాజీవ్ రహదారిపై పల్టీ కొట్టి బోల్తా పడింది. ఆటోలో ఉన్న రామకృష్ణ, డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
పట్టపగలే ఇంట్లో చోరీ
నంగునూరు(సిద్దిపేట): పట్ట పగలే దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం వెంకటాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రేకులపల్లి శ్యామల ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.15 వేల నగదు, రెండున్నర తులాల బంగారం దోచుకెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న శ్యామల దొంగతనం జరిగినట్లు గుర్తించి రాజగోపాల్‌పేట పోలీసులకు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.