
చిరుత దాడిలో దూడ మృతి
హవేళిఘణాపూర్(మెదక్): చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బ్యాతోల్ అటవీ ప్రాంతంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బ్యాతోల్ గ్రామానికి చెందిన రైతు రాజయ్య తన పశువులను అటవీ ప్రాంతంలో కట్టేసి వచ్చాడు. ఉదయం వెళ్లేసరికి చిరుత వచ్చి లేగదూడను చంపి తిని పడవేసినట్లు బాధితుడు తెలిపారు. ఘటనా స్థలాన్ని సెక్షన్ ఆఫీసర్ స్రవంతి, బీట్ ఆఫీసర్ అశ్వక్ పరిశీలించి వెటర్నరీ అధికారులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి చిరుతపులి దాడి చేసినట్లు పోస్టుమార్టంలో వెటర్నరీ అధికారులు గుర్తించారు. బాధిత రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. పులి సంచరిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు లు రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
బావిలో పడి వ్యక్తి మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): బావిలో పూడికతీత పనులు చేస్తుండగా కాలుజారి పడిపోవడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శివరాత్రి కనకయ్య(40) ఒడ్డెర కార్మికుడు. రేగొండ గ్రామానికి చెందిన రైతు బొడిగే మల్లయ్య బావి పూడికతీత పనుల కు వెళ్లాడు. 15 రోజులుగా పనులు చేస్తు న్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బావి పైన మట్టి పెళ్లలు, బండరాళ్లు తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారి కాలు జారి బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యా డు. 108 అంబులెన్స్‌లో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం కనకయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వివాహిత..
శివ్వంపేట(నర్సాపూర్): చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల పరిధి కొంతన్‌పల్లి గ్రామానికి చెందిన చెల్లి వినోద(32) కుటుంబ కలహాలతో ఆరు రోజుల కిందట పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అత్తింటి వేధింపులతోనే వినోద ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. కూతురి మృతికి కారకులైన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి తండ్రి డాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడికి జైలు శిక్ష
నంగునూరు(సిద్దిపేట): గుడిలో దొంగతనం చేసిన వ్యక్తికి సిద్దిపేట అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఏడాదిపాటు జైలు శిక్ష విధించినట్లు రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అసీఫ్ తెలిపారు. కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన బోదాసు యాదగిరి ఎనిమిది నెలల కిందట నంగునూరు మండల గట్లమల్యాలలోని పెద్దమ్మ గుడిలో దోపిడీకి పాల్పడ్డాడు. రూ.35 వేల నగదుతో పాటు బంగారం, ఇత్తడి గంటను దొంగిలించాడు. విచారణ అనంతరం నిందితుడిని గుర్తించి చార్జీషీట్ దాఖలు చేయడంతో రూ.500 జరిమానతోపాటు సాధారణ జైలు శిక్ష విధించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
చేర్యాల(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం మండల పరిధిలోని ఆకునూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉల్లెంగుల వెంకటేశ్ భార్య మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లింది. పొలం పనుల నిమిత్తం వెంకటేశ్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చిచూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.25 వేలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డట్లు బాధితుడు వాపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నీరేశ్ తెలిపాడు.

చిరుత దాడిలో దూడ మృతి