
97.18%
పన్ను వసూలు
సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటితోపాటు గ్రామ పంచాయతీలు ప్రత్యేకంగా పన్ను వసూలు చేస్తారు. జిల్లాలో గడిచిన ఆర్థిక ఏడాది(2024–25)లో ఆస్తి పన్ను వసూలు 97.18% శాతం పూర్తి చేశారు. వసూలైన పన్ను గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతుంది.
633 గ్రామ పంచాయతీల్లో వసూలు...
జిల్లాలో 633 గ్రామపంచాయతీలు ఉండగా ఆయా జీపీలలో రూ.23,53,58,096లు వసూలు చేయాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి మొత్తంగా రూ.22,87,24,676లు పన్ను వసూలు చేశారు. నిర్దేశించిన మార్చి 31 తేదీ లోపు వసూళ్ల ప్రక్రియను ముగించారు. వసూలు చేసిన పన్నును చలాన్ తీసి బ్యాంకులలో సంబంధిత గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేశారు.
100 శాతం
పూర్తి చేసిన మండలాలు
జిల్లాలోని కల్హేర్, మనూరు, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్, సిర్గాపూర్, అమీన్‌పూర్, ఆందోల్, మునిపల్లి, వట్‌పల్లి, కోహీర్, న్యాల్‌కల్ మండలాల్లో 100% పన్ను వసూలు పూర్తిచేసి జిల్లాలో ముందంజలో నిలబడ్డాయి. అదేవిధంగా మరికొన్ని మండలాలు 99% పన్ను వసూలు పూర్తి చేశాయి.
అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు
వసూలు చేసిన పన్నులతో సంబంధిత గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకోసం ఆ నిధులను కేటాయిస్తారు. గ్రామంలోని వీధి దీపాల నిర్వహణ, మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్య పనులతోపాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెచ్చిస్తారు. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారులు, సంబంధిత పంచాయతీ కార్యదర్శి తీర్మానం చేసి, అధికారుల అనుమతితో ఖర్చు చేస్తారు. పాలకవర్గం లేకపోవడం నిధులు నిలిచిపోవడంతో వసూలైన పన్నులు పంచాయతీలకు కొంతమేర ఊరటనిచ్చింది.
జిల్లాలోని
గ్రామ పంచాయతీలు 633
వసూలు కావాల్సిన పన్ను రూ.23,53,58,096
వసూలైన పన్ను రూ.22,87,24,676
100శాతం వసూలు చేసిన
మండలాలు 11
రూ.22.87కోట్ల ఆదాయం
జీపీ ఖాతాలో జమ చేసిన అధికారులు
ఇంటింటికీ తిరిగి పన్ను వసూలు
మౌలిక వసతులకు నిధులుకేటాయించనున్న యంత్రాంగం