
పచ్చని చెట్ట్టే పర్యావరణానికి చేటు
పటాన్‌చెరు టౌన్: పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న కోనోకార్పస్ మొక్కలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారుతున్నాయి. దుబాయి చెట్టుగా పిలవబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవర పెడుతోంది. ముఖ్యంగా వీటి పుష్పాలు వెదజల్లే పుప్పొడితో శ్వాసకోశ, అలర్జీ సమస్యలు తలెత్తుతాయనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ మొక్కలను నిషేధించింది.
జిల్లా పరిధిలో...
జీహెచ్‌ఎంసీ సర్కిల్–22, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారి డివైడర్ల మధ్య, గ్రామాల్లో విరివిగా కోనోకార్పస్ మొక్కలు నాటారు. ఇప్పటికే ఇవి చెట్లుగా మారాయి. ప్రతీ చెట్టుకు పుష్పాలు రాగా...అవి వెదజల్లే పుప్పొడితో పలు శ్వాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనో కార్పస్ మొక్కలు నాటడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇటీవలే శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కోనో– కార్పస్ మొక్కలను తొలగించాలని చెప్పిన విషయం తెలిసిందే.
పలు ఆరోగ్య సమస్యలకు కారణం...
కోనోకార్పస్ మొక్క పర్యావరణానికి హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతోందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటని మరికొన్ని అరబ్ దేశాలు గుర్తించాయి.
రహదారుల గుండా ఏపుగాపెరిగిన కోనోకార్పస్ నిషేధించిన ప్రభుత్వం
మొక్కలను తొలగించాలి...
సర్కిల్ – 22 పరిధిలో రహదారి డివైడర్లపై, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ చూసినా నేటికీ కోనోకార్పస్ మొక్కలు కనిపిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి భారీగా పెరిగిన మొక్కలను తొలగించాలి.
– మహేందర్,
అంబేడ్కర్ కాలనీ పటాన్‌చెరు
శ్వాసకోశ, అలెర్జీలకు దారితీస్తుంది
కొనోకార్పస్ అనేది విదేశీ మొక్క. ఇది వేగవంతమైన పెరుగుదల, పచ్చదనం కఠినమైన పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వలన దీనిని పరిశ్రమలు, రోడ్ల పక్కన ప్రకృతి దృశ్యాలకు సమీపంలో నాటడానికి ఉపయోగిస్తారు. కానీ, దురదృష్టవశాత్తు దీని పుప్పొడి మానవులలో శ్వాసకోశ సమస్యలు, అలెర్జీ, దగ్గుకు దారితీస్తోందని తేలింది. పర్యావరణ వ్యవస్థకు కూడా పెద్దగా ఉపయోగపడదు. ఇది ఎక్కువగా భూగర్భ జలాలను గ్రహిస్తుంది, మన స్థానిక జాతుల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది.
– మల్లిక, వృక్షశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల

పచ్చని చెట్ట్టే పర్యావరణానికి చేటు

పచ్చని చెట్ట్టే పర్యావరణానికి చేటు