
ప్రభుత్వ నిర్ణయంతోరైతుల్లో చిగురించిన ఆశలు
● జూన్‌లో వరి, జొన్న, పప్పుధాన్యాల విత్తనాలు అందుబాటులోకి ● ముందుగా అభ్యుదయ రైతులకుపంపిణీకి నిర్ణయం ● ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్
జహీరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గత ఐదేళ్ల నుంచి వ్యవసాయ శాఖ తరఫున విత్తనాల పంపిణీ లేకపోవడంతో రైతులు హైబ్రీడ్ రకాల వైపు మొగ్గుచూపారు. హైబ్రీడ్ విత్తనాలకు బదులు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు చేసి విత్తనాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఒక్కో గ్రామంలో ముగ్గురి నుంచి ఐదుగురికి విత్తనాలు అందిస్తారు. వారు పండించిన తర్వాత వచ్చిన పంటను రైతులకు రెండో పంటగా అవే విత్తనాలను వాడుకోవచ్చు. ఇలా మూడేళ్ల కాలంలో గ్రామంలోని రైతాంగానికి అంతా తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా రైతాంగానికి నకిలీ విత్తనాల మోసాల బారి నుంచి రక్షించబడటంతోపాటు నాణ్యమైన విత్తనం ద్వారా 10 నుంచి 15% మేర అదనంగా దిగుబడులు సాధించే అవకాశాలుంటాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేయగా, అందులో ముఖ్యమైన విత్తనాలను మాత్రం రైతులకు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
సాగు పెరుగుతుంది
ప్రభుత్వం నాణ్యవంతమైన పప్పుధాన్యాల రకాల విత్తనాలు అందుబాటులోకి తీసుకువస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దీంతో సాగు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. హైబ్రీడ్ విత్తనాలపైనే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వ నిర్ణయం సంతోషకరంగా ఉంది. పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండేలా చూడాలి.
– గోవర్ధన్‌రెడ్డి, రైతు
గుడ్‌పల్లి గ్రామం, మొగుడంపల్లి మండలం
ప్రణాళికలను సిద్ధం చేస్తోంది
పప్పుధాన్యాలతోపాటు వరి, జొన్న రకాల విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ముందుకు విత్తనాలను వానాకాలం సీజన్‌లో అభ్యుదయ రైతులకు అందిస్తారు. వారు పండించిన పంటను తిరిగి విత్తనంగా ఉపయోగించుకునేందుకు తోటి రైతులకు అందజేస్తారు. దీంతో గ్రామంలోని రైతులందరికీ విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా విత్తన సమస్య తీరుతుంది.
– భిక్షపతి, ఏడీఏ–జహీరాబాద్
సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏడాది లక్ష ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఇందుకోసం అవసరమైన విత్తన రకాల అందుబాటులో లేకపోవడంతో రైతులు హైబ్రీడ్ విత్తనాలనే కొనుగోలు చేసుకుని సాగుచేస్తున్నారు. ఇందుకోసం అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. 84వేల ఎకరాల్లో కందిపంట, 15 ఎకరాల్లో పెసర పంట, 8వేల ఎకరాల్లో మినుము పంటలు సాగవుతున్నాయి. 1.40లక్షల ఎకరాల్లో వరి, రెండు వేల ఎకరాల్లో జొన్న పంటను రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం విత్తనాల రకాలను అందుబాటులో ఉంచితే పప్పుధాన్యాల సాగు రెట్టింపు అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతోరైతుల్లో చిగురించిన ఆశలు

ప్రభుత్వ నిర్ణయంతోరైతుల్లో చిగురించిన ఆశలు

ప్రభుత్వ నిర్ణయంతోరైతుల్లో చిగురించిన ఆశలు