
పోషకాహార లోపాన్ని అరికట్టాలి
సంగారెడ్డి: ఎప్పటికప్పుడు మహిళల్లోనూ, గర్భస్థ శిశువుల్లోనూ పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. చౌటకూరు మండలం, శివంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి రెండేళ్లవరకు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒత్తిడి తగ్గేందుకు వ్యాయా మాలు, యోగాలు కూడా అంగన్‌వాడీ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. ప్రతీ నెలలో రెండవ శుక్రవారం, నాలుగో శుక్రవారం తల్లికి కుటుంబ సభ్యులకు పౌష్టికాహారంపై కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఇంట్లోని వయో వృద్ధులను, తల్లిదండ్రులను భారంతో కాకుండా బాధ్యతతో చూడాలని చెప్పారు. తల్లిదండ్రుల్ని వద్ధుల్ని ఇబ్బంది గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూ ఓ లలితకుమారి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిణి వసంతకుమారి, డీఈఓ వెంకటేశ్వ ర్లు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఆర్డీఓ పాండు, సీడీపీఓలు, సంబంధిత అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.
శివంపేటలో పోషణ పక్షం కార్యక్రమం
కలెక్టర్ వల్లూరు క్రాంతి