
నిర్మాణం పెనుభారం!
● భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ● స్టీల్, ఇసుక, సిమెంట్ ధరలు ౖపైపెకి ● పెరిగిన కూలీ రేట్లు ● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
జహీరాబాద్ టౌన్: ఇల్లు కట్టి చూడు..పెళ్లి చూసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. రెండింటికీ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నాడైనా నేడైనా. రోజు రోజుకు భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకడంతో బడ్జెట్ అంచనాలు తారుమారవుతున్నా యి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబడటం లేదు. సిమెంట్, స్టీల్, ఇసుక, పీవీసీ, విద్యుత్, ప్లంబింగ్ మెటీరియల్, కలర్, కూలీ రేట్లు ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలంటే సామాన్య ప్రజ లు బెంబేలెత్తున్నారు. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా ఇంటి పనులు మొదలు పెట్టాలనుకునేవారు సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు.
పెరిగిపోతున్న రేట్లు...
భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మేసీ్త్ర, కూలీల రేట్లు సైతం ఎక్కువయ్యాయి. సొంతగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గతేడాది చదరపు అడుగు రూ.1,700–1,800 వరకు అయ్యేది. అదే గుత్తేదారు అయితే రూ.1,700–1,900 వరకు చేసేవారు. గుత్తేదారుకు ఇస్తే రూ.2,000–2,200 దాకా తీసుకుంటున్నారు. మార్కెట్‌లో ఇసుక టన్నుకు రూ.2,500 నుంచి రూ.2,800 వరకు పలుకుతుంది. స్టీల్ టన్ను రూ.54 వేల నుంచి ఉంది. సిమెంట్ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ.360 వరకు పలుకుతోంది. మేసీ్త్ర,కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి.
ఇసుక మరింత ప్రియం
ఇళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఉంది. ఇసుకలో రెండు రకాలు. కట్టడానికి ఉపయోగించేది. ప్లాస్టింగ్‌కు వాడేది. సన్నరకం ఇసుక టన్నుకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నారు. ఇసుక కొరత వల్ల ఓవర్ లోడ్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. పునాదులు, స్లాబ్‌కు ఉపయోగించే కంకరు ధర కూడా పెరిగింది. 300 ఫీట్‌కు రూ.900 వరకు విక్రయిస్తున్నారు. గతంతో పొలిస్తే కార్మికులు, కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కలర్, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30% వరకు పెరిగాయి. ఫ్లోరింగ్, టైల్స్ ధరలు కూడా 30% పెరిగాయి. ఇలా నిర్మాణానికి ఉపయోగించే ప్రతీ వస్తువు ధర పెరిగిందని, సొంతంగా ఇళ్లు కట్టుకునే ప్రజలతో పాటు బిల్డర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరల కారణంగా నిర్మాణాలు కాస్త మందగించాయంటున్నారు.
ధరలు పెరగడంతో నష్టపోతున్నాం
నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. ఇసుక, సిమెంట్, స్టీల్, డస్ట్,కంకర, ఇతర మెటీరియల్ రేట్లు పెరగడం వల్ల గతేడాది ఒప్పందం చేసుకున్న పనులకు నష్టం వస్తోంది. లేబర్ ఛార్జీలు కూడా చాలా పెంచారు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో నిర్మాణం రంగంపై దెబ్బపడింది.
–ఎస్‌ఎన్, భూషణం, ఇంజనీర్, జహీరాబాద్