మల్లన్నా.. ఎందుకిలా? | - | Sakshi
Sakshi News home page

మల్లన్నా.. ఎందుకిలా?

Published Sun, Sep 17 2023 6:30 AM | Last Updated on Tue, Sep 19 2023 1:37 PM

దాసారం గుట్టపై మట్టిని చదును చేసి వదిలేశారు - Sakshi

దాసారం గుట్టపై మట్టిని చదును చేసి వదిలేశారు

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్వర్యంలో దాసారం గుట్టపై హిల్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్న తీరు అనుకొన్నదొక్కటి.. ఐయ్యిందొక్కటిలా మారింది. ప్రణాళికా లోపం కారణంగా చిన్న పనిగా మొదలైన రోడ్డు నిర్మాణం ఇప్పుడు బాహుబలి ప్రాజెక్టుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

సాక్షి, సిద్దిపేట: భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం దాసారం గుట్ట పైన గెస్ట్‌హౌస్‌లను నిర్మించాలని నిర్ణయించింది. గుట్టమీద చదును చేస్తే రెండు ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లుగా కొమురవెల్లికి సరికొత్త సొబగులు అద్దుతామంటూ గొప్పలు చెప్పారు. అనుకున్నదే తడవుగా అనుమతులు జారీ చేశారు. నిధులు మంజూరు చేశారు. తీరా పనులు మొదలెట్టాక, పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పనులు మొదలై ఐదేళ్లు దాటింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

చారాణా పనికి..
గెస్ట్‌హౌస్‌లను నిర్మించేందుకు ఎంపిక చేసిన దాసారం గుట్టపైకి రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఫీట్ల వెడల్పుతో 550 మీటర్ల రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు గుర్తించారు. రెండు మూల మలుపులు ఉండే విధంగా డిజైన్‌ ఖరారు చేశారు. 2017లో ప్రారంభించారు. ఆరంభంలో ఈ రోడ్డు నిర్మాణం అంచనా వ్యయం కేవలం రూ.1.40 కోట్లు. కానీ ఆ నిధులతో పదిశా తం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో 2021లో అంచనాలు సవరించి రూ.3.5 కోట్లు కేటాయించా రు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు 4.9కోట్లు వెచ్చించినా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో రోడ్డు అందుబాటులోకి రావాలంటే మరో రూ.1.9 కోట్లు అవసరం అంచనాలు వేశారు. ఆ నిధులు ఇంకా మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

లక్ష్యం నెరవేరేనా?
ప్రస్తుత అంచనాల ప్రకారం గుట్టపైకి రోడ్డు కోసమే రూ.9కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే రూ.9కోట్లు వెచ్చిస్తే కొమురవెల్లి దేవాలయానికి సమీపంలో తొమ్మిది ఎకరాలకు పైగా స్థలం లభించేదని స్థానికులు అంటున్నారు. పైగా గుట్టపై నిర్మించే గెస్ట్‌హౌస్‌లు సైతం వీవీఐపీల వరకే పరిమితం కానున్నాయి. కొమురవెల్లి దేవాలయానికి వాహనాల్లో వచ్చిన వారే గుట్ట పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. సాధారణంగా బస్సుల ద్వారా వచ్చే భక్తులు గుట్ట మీద ఆశ్రయం పొందలేరు. అంచనా వ్యయాని కి మూడున్నర రెట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కమీషన్ల కోసమేనా?
గుట్టపైన అందుబాటులోకి వచ్చే స్థలం కేవలం రెండు ఎకరాలు. కామన్‌ యూజ్‌ ఏరియా, పార్క్‌ తదితర ఏర్పాట్లకు స్థలాన్ని కేటాయిస్తే కాటేజీల నిర్మాణానికి దక్కే స్థలం కష్టంగా ఎకరాన్ని మించి ఉండదు. హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ కావడంతో విశాలంగా నిర్మాణం చేయకపోతే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కేవలం ఎకరం స్థలం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నిర్మాణ పనుల్లో కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారనే విమర్శలు సైతం వినవస్తున్నాయి.

నిధులు రాగానే పనులు
గుట్టమీద దారి కోసం మొదట రూ.1.4కోట్ల నిధులు కేటాయించారు. గుట్టమీదికి మట్టితో రోడ్‌ ఫాం చేస్తే ఉండదు. కనుక వాల్స్‌ను నిర్మించి రోడ్‌ ఫాం చేస్తున్నాం. అందుకే వ్యయం పెరిగింది. మళ్లీ నిధులు కేటాయించగానే పనులు ప్రారంభిస్తాం.

– శ్రీనివాస్‌ రెడ్డి, డీఈ,

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గుట్ట పైకి వేస్తున్న రోడ్డు1
1/1

గుట్ట పైకి వేస్తున్న రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement