
సమయపాలన పాటించని అధికారులు
● ఉదయం 11 గంటలవుతున్నా అరకొరగా హాజరు ● నిరీక్షణలో అర్జీదారులు ● పెండింగ్‌లో వందలాది వినతులు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం అపహాస్యమవుతోంది. సమస్యలపై వినతులను స్వీకరించేందుకు అధికారులు సరైన సమయానికి రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినతుల స్వీకరణను కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్‌డీఓ జయదేవ్‌లు సోమవారం ఉదయం 10:30గంటలకు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు సైతం ఆ సమయంలోగా హాజరుకావాలి. సుమారు 11 గంటలవుతున్నా 49 మంది అధికారులకు 12 మందే హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వారి కోసం అర్జీదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
–సాక్షి, సిద్దిపేట
జిల్లా ఉన్నతాధికారులే సమయ పాలన పాటించడంలేదు. ప్రజావాణి 10:30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10:45గంటల వరకు డీఎస్‌ఓ తనూజ, డీపీఓ దేవకీ దేవి, జిల్లా మత్స్య శాఖ అధికారి మధుసూదన్, డీఐసీ జనరల్ మేనేజర్ గణేశ్ రామ్, ఎల్‌డీఎం హరిబాబు, జీజీహెచ్‌ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రావణి, ఏడీ మైన్స్ లింగస్వామి, ఎస్సీ వేల్ఫేర్ అధికారి హైమద్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అశోక్ కుమార్, డీడబ్ల్యూఓ లక్ష్మీకాంత్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీ ల్యాండ్స్ సర్వే వినయ్ కుమార్‌లు ప్రజావాణికి హాజరయ్యారు.ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరుగా 11:20గంటల వరకు చేరుకున్నారు. సమయపాలన పాటించాలని రిజిస్ట్రర్ సైతం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ఉన్నతాధికారులు డుమ్మా..
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఆయా శాఖల ఉన్నతాధికారులు విధిగా హాజరుకావాలి. కొందరు జిల్లా అధికారులు డుమ్మా కొట్టి.. కింది స్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపిస్తుండటం గమనార్హం. కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఉన్న శ్రద్ధ జిల్లా అధికారులకు ఉండటం లేదని పలువురు దరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు.
పలువురు ఫోన్లలో బిజీ
ప్రజావాణికి వచ్చిన అధికారులు పలువురు ఫోన్లలో మాట్లాడటమే సరిపోతోంది. కలెక్టర్‌కు వినతి ఇవ్వగానే వెంటనే ఆయా శాఖ జిల్లా అధికారిని పిలిచి అప్పగించి పరిష్కారించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఆ శాఖ అధికారికి సమస్య వివరించేందుకు దరఖాస్తు దారులు వెళ్తున్నారు. సదరు అధికారులు గంటల తరబడి ఫోన్లలో బిజీగా ఉండటంతో దరఖాస్తుదారులు ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు ఉన్నతాధికారులే ఇలా వ్యవహరించడం చర్చకు దారితీస్తోంది.
కలెక్టరేట్ గోడలపై పెట్టుకుని రాస్తున్న వినతులు
పెండింగ్‌లో 411 వినతులు
ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రతి సోమవారం సుమారు 50 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. గతేడాది మార్చి 1 నుంచి ఈ ఏడాది మార్చి 10వ తేదీ వరకు 1,262 వినతులు రాగా వీటిలో 851 పరిష్కారమైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 411 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించినవి ఎక్కువగా వస్తున్నాయి. తమ భూములు ఆక్రమించారని, సర్వే చేయించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఇలా పలు సమస్యలపై వినతులు వస్తున్నాయి. సమస్యలను త్వరగా పరిష్కరించాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు. దరఖాస్తులు రాసేందుకు కనీసం టేబుళ్లు లేకపోవడంతో గోడలపై పెట్టుకుని వినతులను రాస్తున్నారు. వినతులు రాసుకునేలా టేబుళ్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

సమయపాలన పాటించని అధికారులు

సమయపాలన పాటించని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment