అక్కన్నపేట(హుస్నాబాద్): ‘ప్రాణాలైనా ఇస్తాం.. కానీ ఇండస్ట్రియల్ పార్కుకు భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. మండల పరిధిలోని చౌటపల్లిలో బుధవారం ఆర్టీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. సభకు చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల పరిధిలో భూములు కోల్పుతున్న రైతులు హాజరయ్యారు. చౌటపల్లిలో 83.36 ఎకరాలకు గాను 162 మంది, జనగామలో 15.20 ఎకరాలకు గాను 12 మంది, తోటపల్లిలో 25.20 ఎకరాలకు గాను 21 మంది రైతుల భూములను కోల్పోతున్నారు. మొత్తం 124.36 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూ సేకరణ చేయనున్నట్లు గ్రామసభలో తహసీల్దార్‌లు అనంతరెడ్డి, రవీందర్ చదవి వినిపించారు. ఈ సందర్భంగా రైతులు అభ్యంతరాలు, వినతి పత్రాలను సమర్పించారు. పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడమేమిటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కొని తమ కడుపు కొట్టొద్దని వేడుకొన్నారు. గ్రామసభ ముగిసిన తర్వాత చౌటపల్లి గ్రామ మహిళ రైతులు తమ భూములు ఇవ్వబోమంటూ నిరసన తెలిపారు.
కాలుష్య రహిత ‘ఇండస్ట్రియల్’
కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేయబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారని ఆర్డీఓ రామ్మూర్తి చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం రైతులందరూ తప్పకుండా సహకరించాలని, భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ సతీశ్, తహసీల్దార్లు అనంతరెడ్డి, రవీందర్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ మోహన్‌నాయక్, ఆర్‌ఐ యాదగిరి, జాహిద్, రాజయ్య, సీనియర్ అసిస్టెంట్ రాజు, పంచాయతీ కార్యదర్శులు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
భూములు లాక్కొని పొట్టకొట్టొద్దు
గ్రామసభలో రైతుల ఆందోళన