విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి
● ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం
● జాతీయ సదస్సు ప్రారంభం
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సును బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేలా ఉన్నత విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయన్నారు. వీటిని వెనకబడిన వర్గాలు అందిపుచ్చుకుంటేనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి మాట్లాడుతూ ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ నేపథ్యంలో సామాజిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయని, వాటిని అధిగమించి అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఉద్యమ జ్ఞాపకాలు, పాటలతో విద్యార్థినీ, విద్యార్థులను అలరించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించిన అర్థశాస్త్ర విభాగం అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో దరువు ఎల్లన్న, డా. దివ్య తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ అనురాధతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.