
మతాలకతీతంగా కలిసి నడుద్దాం
రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: మతాలకతీతంగా ప్రగతికి కలిసి నడుద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా స్థానిక ఎక్బాల్ మినార్ వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా సంతోషంగా పండుగలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. కొంతమంది దుష్ట శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందరూ ఓపిక, శాంతితో కలిసిమెలిసి ఉండి దేశ, రాష్ట్ర అభ్యున్నతికి సోదర భావంతో ఉండాలని సూచించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో పాటు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పలువురు ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.