
20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు మెదక్ జిల్లా డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్‌లో 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆలస్యమైతే నో ఎంట్రీ
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు కేంద్రంలోని చేరుకోవాలన్నారు.
పదికి 3.. ఇంటర్‌కు 5 కేంద్రాలు: జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షలకు మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం మెదక్(2), నర్సాపూర్(2), తూప్రాన్(1) చొప్పున మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కనీస వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
క్రిమినల్ కేసులు
పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారి పై చట్టం 25/1997 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వా డ్, ఇద్దరు ప్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులు ఉంటారన్నారు.
5 నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
అభ్యర్థులకు గుర్తింపు కార్డు తప్పనిసరి