కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..

Published Fri, Apr 18 2025 5:36 AM | Last Updated on Fri, Apr 18 2025 7:39 AM

కొనుగ

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..

● ట్రాక్టర్‌ బోల్తా పడి రైతు మృతి ● మరో నలుగురికి గాయాలు ● నిజాంపేట్‌ మండలంలో ఘటన

నారాయణఖేడ్‌: ఆరుగాలం కష్టపడి పండిన వరి ధాన్యాన్ని తానే ట్రాక్టర్‌ నడుపుతూ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరంలో కొనుగోలు కేంద్రం ఉందనగా ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజాంపేట్‌ మండలం శాఖాపూర్‌కు చెందిన గడ్డమీది అశోక్‌ (38) తన పొలంలో పండిన ధాన్యంను నిజాంపేటలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ట్రాక్టర్‌లో లోడ్‌ చేశాడు. ట్రాక్టర్‌ను తోలుకుంటూ అశోక్‌ వస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రానికి కొద్ది దూరంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్‌ చేస్తున్న రైతు అశోక్‌ ట్రాక్టర్‌ స్టీరింగ్‌ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న బీర్ల లక్ష్మయ్య, బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అశోక్‌ భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరూర్‌ శివారులో గురువారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్‌ గౌడ్‌ కథనం మేరకు.. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన మొరంగపల్లి రాజయ్య(79) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం సదాశివపేట పట్టణానికి టీవీఎస్‌ ఎక్సెల్‌ పై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఆరూర్‌ శివారులోని ఎవరెస్ట్‌ పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజయ్యను సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి

చిన్నశంకరంపేట(మెదక్‌): విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం ఎల్లయ్య కుమారుడు దాసు(32) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గొర్రెలను మేపడానికి గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దాసు చందంపేట గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద దాహం తీర్చుకునేందుకు వెళ్లాడు. బోరు బావి స్టార్టర్‌ బాక్స్‌ వద్ద కరెంట్‌ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి

గజ్వేల్‌రూరల్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అక్కారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్‌ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామానికి చెందిన గొర్లకాడి దుర్గాప్రసాద్‌(26) బైక్‌పై ప్రజ్ఞాపూర్‌ నుంచి తీగుల్‌ వైపు వస్తున్నాడు. గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఏడాది కిందట చేర్యాల ప్రాంతానికి చెందిన పుష్పతో వివాహం జరుగగా ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణీ అని గ్రామస్తులు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గాప్రసాద్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా.. 1
1/3

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా.. 2
2/3

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా.. 3
3/3

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement