100 మీటర్ల చాంప్‌ నోవా లైల్స్‌  | 100m champ Noah Lyles | Sakshi
Sakshi News home page

100 మీటర్ల చాంప్‌ నోవా లైల్స్‌ 

Aug 21 2023 2:08 AM | Updated on Aug 21 2023 2:08 AM

100m champ Noah Lyles - Sakshi

బుడాపెస్ట్‌ (హంగేరి): ‘జమైకా చిరుత’ ఉసేన్‌ బోల్ట్‌ రిటైరయ్యాక... పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌ ఈవెంట్‌లో మళ్లీ అమెరికన్‌ అథ్లెట్లు ఆధిపత్యం చాటుకుంటున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్లో అమెరికా అథ్లెట్‌ నోవా లైల్స్‌ పసిడి పతకం సాధించాడు. 26 ఏళ్ల నోవా లైల్స్‌ అందరికంటే వేగంగా 9.83 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి ఈ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు.

లెట్సిలె టెబోగో (బోట్స్‌వానా; 9.88 సెకన్లు) రజతం... జార్నెల్‌ హ్యూస్‌ (బ్రిటన్‌; 9.88 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓబ్లిక్‌ సెవిల్లె (జమైకా) కూడా 9.88 సెకన్లలో రేసును ముగించాడు. అయితే ఫొటో ఫినిష్‌ ఆధారంగా రజత, కాంస్య పతకాలను ఖరారు చేశారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జస్టిన్‌ గాట్లిన్‌ (అమెరికా) ధాటికి ఉసేన్‌ బోల్ట్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకొని అదే ఏడాది ఆటకు వీడ్కోలు పలికాడు.

అనంతరం 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్రిస్టియన్‌ కోల్‌మన్‌ (అమెరికా), 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫ్రెడ్‌ కెర్లీ (అమెరికా) 100 మీటర్ల విభాగంలో వరల్డ్‌ చాంపియన్స్‌గా నిలిచారు. ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రెడ్‌ కెర్లీ సెమీఫైనల్లోనే నిష్క్రమించాడు.  

భారత అథ్లెట్లకు నిరాశ 
ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండోరోజు భారత అథ్లెట్లు నిరాశాజనక ప్రదర్శన కనబరిచారు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్‌ కుషారే 2.22 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఓవరాల్‌గా 20వ స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్‌ కుమార్‌ తన హీట్స్‌ను 50.46 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా 36వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement