ఢిల్లీలోని ‘గాంధీ స్మృతి’ వద్ద మోదీ నివాళి , బెంగళూరులో గాంధీజీ విగ్రహంపై గులాబీల వర్షం కురిపిస్తున్న విద్యార్థినులు
న్యూఢిల్లీ: శాంతి, సహనం, అహింసను బోధించిన మహాత్ముడి జయంతిని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంది. గాంధీ బోధనలను ఆచరించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గాంధీ గొప్పదనాన్ని కీర్తిస్తూ ఆయన 149వ జయంత్యుత్సవాలు జరుపుకున్నారు. మహాత్ముని స్ఫూర్తిదాయక జీవితానికి గుర్తింపుగా ఆయనకు అమెరికా కాంగ్రెస్ అత్యున్నత పౌర పురస్కారం ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను ఇవ్వనుంది.
ఈ దిశగా అమెరికా కాంగ్రెస్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. బ్రిటన్‌లో దౌత్యకార్యాలయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గాంధీ బోధనలను గుర్తుచేసుకుంటూ ‘బాపుః150’ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఐరాస ప్రధాన కార్యదర్శి సహా ప్రముఖులు గాంధీకి పుష్పాంజలి ఘటించారు. గాంధీ బోధనలను అలవర్చుకుని దేశ సేవకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
గాంధీకి సరైన గుర్తింపు
ప్రపంచశాంతికి మహాత్ముని బోధనల స్ఫూర్తిని, శాంతి, అహింసలను పాటించిన గాంధీ గొప్పదనాన్ని గుర్తిస్తూ.. ప్రతిష్టాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ ఇవ్వాలంటూ అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఉమెన్ కరోలిన్ మేలోనీ సెప్టెంబర్ 23న ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. భారత అమెరికన్ చట్టసభ్యులైన అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు మద్దతు తెలిపారు.
భారత్, భారత అమెరికన్లపై అమెరికా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలైన తులసీ గబ్బార్డ్ కూడా ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చొరవ తీసుకున్నారు. అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను గాంధీకి ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కమిటీ, అత్యవసర చర్యల పరిపాలన కమిటీకి పంపించారు.
దేశవ్యాప్తంగా..
భారతదేశవ్యాప్తంగా గాంధీ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు, స్వచ్ఛత కార్యక్రమాల ద్వారా గాంధీకి యావద్భారతం ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాజకీయ ప్రముఖులు వివిధ దేశాల దౌత్యవేత్తలు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో మహాత్ముడిని స్మరించుకుంటూ 15 అడుగుల పొడవు, 9 అడుగుల ఎత్తయిన చరఖాను ప్రదర్శించారు. చైనా రాజధాని బీజింగ్‌లో, ఇజ్రాయెల్‌లోనూ గాంధీ జయంతిని నిర్వహించారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో భారత పోస్టల్ శాఖ రూపొందించిన గాంధీ స్మారక స్టాంపును విడుదల చేశారు.
124 మంది కళాకారులతో..
గాంధీ జయంతిని పురస్కరించు కుని భారత విదేశాంగ శాఖ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలో జరిగిన మహాత్మా గాంధీ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాన మంత్రి మహాత్ముడిపై విదేశాంగ శాఖ రూపొందించిన ఓ సంగీత దృశ్యాన్ని విడుదల చేశారు.
ఇందులో 40 దేశాలకు చెందిన 124 మంది కళాకారులు మహాత్ముని ప్రీతిపాత్రమైన భక్తి గీతం ‘వైష్ణవ జన్‌తో తేనె కహీయే’ను తమ తమ వాయిద్యాలతో ప్రదర్శించారు. ఐదు నిమిషాల నిడివితో అద్భుతంగా రూపొందించిన ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. రాజకీయ పార్టీలు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య లక్ష్యాలను చేరుకోవడం పెద్ద కష్టమేం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment