వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టి20లో ఓటమి పాలైనప్పటికి ఒక్కరోజు వ్యవధిలోనే ఆ చేదు ఫలితాన్ని మరిపించేలా టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ క్రమంలోనే లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా టి20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.
2019 జూలై నుంచి చూసుకుంటే భారత్ 21 మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. ఇందులో 19 సార్లు విజయాలు సాధించిన భారత్.. కేవలం రెండుసార్లు మాత్రమే ఓటములు చవిచూసింది. ఇక సెంట్‌కిట్స్ వేదికలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన భారత్ పేరిట నమోదైంది. 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంతకముందు 2017 ఆగస్టులో అప్గనిస్తాన్‌పై విండీస్ చేధించిన 147 పరుగుల టార్గెట్ ఇంతవరకు అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఆ రికార్డును టీమిండియా సవరించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో రిషబ్ పంత్(26 బంతుల్లో 33 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అంతకుముందు వెస్టిండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మేయర్స్, బ్రాండన్ కింగ్ (20 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఓపెనింగ్ వికెట్‌కు 57 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), హెట్‌మైర్ (12 బంతుల్లో 20; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ముందు విండీస్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టి20 శనివారం(ఆగస్టు 6న) జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment