రెండో టెస్టులో భారత్ ఓటమి
113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం
2–0తో సిరీస్ సొంతం
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 ఆలౌట్
శుక్రవారం నుంచి చివరి టెస్టు
అనూహ్యం, అసాధారణమేమీ జరగలేదు...న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ తమ వైఫల్యాన్ని కొనసాగించారు...భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలి సిరీస్‌ను అప్పగించేశారు... సొంతగడ్డపై కూడా స్పిన్‌ను ఆడలేని తమ బలహీనతను మళ్లీ ప్రదర్శిస్తూ టీమిండియా తలవంచింది...ఫలితంగా పుష్కర కాలం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ చేజారింది... ఒక్క యశస్వి జైస్వాల్ మాత్రమే ధాటిగా ఆడి ఆశలు రేపినా... మిగతావారంతా చేతులెత్తేయడంతో మూడో రోజుకే మ్యాచ్ ముగిసింది... కివీ బౌలర్ సాంట్నర్ మరోసారి తన మాయాజాలం ప్రదర్శిస్తూ ఆరు వికెట్లతో చెలరేగాడు. శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడి ఏమాత్రం అంచనాలు, ఆశలు లేకుండా భారత గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్ బృందం అసాధారణ ప్రదర్శనతో ఏకంగా 2–0తో సిరీస్‌నే గెలుచుకోవడం విశేషం. ఇక భారత్ ముందు మిగిలింది చివరి మ్యాచ్‌లో నెగ్గి కాస్త పరువు కాపాడుకోవడమే!
పుణే: స్వదేశంలో భారత జట్టు అనూహ్య రీతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లోనూ నెగ్గిన ఆ జట్టు మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 359 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (65 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధసెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (84 బంతుల్లో 42; 2 ఫోర్లు) చివర్లో కాస్త పోరాడాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ (6/104) మరోసారి భారత్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 198/5తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్ (48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్లన్‌డెల్ (41; 3 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. భారత బౌలర్లలో సుందర్ 4, జడేజా 3 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలో జరుగుతుంది.
జైస్వాల్ మినహా...
క్రీజ్‌లో జైస్వాల్ ఉన్నంత సేపు భారత జట్టు లక్ష్యంపై గురి పెట్టి దూకుడైన ఆటను ప్రదర్శించేందుకు సిద్ధమైందని అనిపించింది. ఒక వైపు రోహిత్ (8) మళ్లీ విఫలమైనా...మరో ఎండ్‌లో జైస్వాల్ తొలి ఓవర్‌నుంచే బౌండరీలతో చెలరేగాడు. అతనికి శుబ్‌మన్ గిల్ (23) కూడా కొద్ది సేపు సహకరించాడు. లంచ్ సమయానికి భారత్ 81/1తో మెరుగైన స్థితిలో కనిపించగా... విరామం తర్వాత 41 బంతుల్లోనే జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే రెండో సెషన్‌లో గిల్‌ను అవుట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టిన సాంట్నర్ ఆ తర్వాత జైస్వాల్ వికెట్‌నూ ఖాతాలో వేసుకున్నాడు.
మరో ఐదు బంతులకే పంత్ (0) అనవసరపు సింగిల్‌కు ప్రయతి్నంచి రనౌట్ కావడం జట్టను మరింత దెబ్బ తీసింది. కోహ్లి పాయింట్ దిశగా ఆడి పరుగు ప్రారంభించగా... పంత్ మరో ఆలోచన లేకుండా దూసుకొచ్చాడు. అయితే అతను డైవ్ చేసినా లాభం లేకపోయింది. కోహ్లి (17)ని సాంట్నర్ ఎల్బీగా దొరకబుచ్చుకోగా, భారత బ్యాటర్ రివ్యూ చేసినా ఫలితం దక్కలేదు. అనంతరం రెండు పరుగుల వ్యవధిలో సర్ఫరాజ్ (9), సుందర్ (21) అవుటయ్యారు. జడేజా, అశి్వన్ (18) కొద్ది సేపు ప్రతిఘటించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు. అంతకు ముందు న్యూజిలాండ్ మూడో రోజు మరో 16.4 ఓవర్లు ఆడి మరో 57 పరుగులు జోడించగలిగింది.
స్కోరు వివరాలు:
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 259; భారత్ తొలి ఇన్నింగ్స్ 156; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) (బి) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 9; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బి) జడేజా 41; ఫిలిప్స్ (నాటౌట్) 48; సాంట్నర్ (సి) బుమ్రా (బి) జడేజా 4; సౌతీ (సి) రోహిత్ (బి) అశి్వన్ 0; ఎజాజ్ (సి) సుందర్ (బి) జడేజా 1; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 255.
వికెట్ల పతనం: 1–36, 2–78, 3–89, 4–123, 5–183, 6–231, 7–237, 8–238, 9–241, 10–255. బౌలింగ్: అశి్వన్ 25–2–97–2, సుందర్ 19–0–56–4, జడేజా 19.4–3–72–3, బుమ్రా 6–1–25–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 77; రోహిత్ (సి) యంగ్ (బి) సాంట్నర్ 8; గిల్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 23; కోహ్లి (ఎల్బీ) (బి) సాంట్నర్ 17; పంత్ (రనౌట్) 0; సుందర్ (సి) యంగ్ (బి) ఫిలిప్స్ 21; సర్ఫరాజ్ (బి) సాంట్నర్ 9; జడేజా (సి) సౌతీ (బి) పటేల్ 42; అశ్విన్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 18; ఆకాశ్‌దీప్ (సి) రచిన్ (బి) ఎజాజ్ 1; బుమ్రా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (60.2 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–34, 2–96, 3–127, 4–127, 5–147, 6–165, 7–167, 8–206, 9–229, 10–245. బౌలింగ్: సౌతీ 2–0–15–0, రూర్కే 1–0–5–0, సాంట్నర్ 29–2–104–6, ఎజాజ్ 12.2–0–43–2, ఫిలిప్స్ 16–0–60–1.
12భారత జట్టు స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయింది. 2012లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 1–2తో ఓడింది.
18 తాజా ఓటమికి ముందు స్వదేశంలో భారత్ వరుసగా గెలిచిన సిరీస్‌ల సంఖ్య.
1 భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. గతంలో కివీస్ ఇక్కడ 12 సిరీస్‌లు ఆడగా...10 ఓడి 2 డ్రా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment