క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు | 3 Super Overs: Thrilling T20 Game Sets World Record | Sakshi
Sakshi News home page

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు

Published Sat, Aug 24 2024 12:12 PM | Last Updated on Sat, Aug 24 2024 12:23 PM

3 Super Overs: Thrilling T20 Game Sets World Record

అంత‌ర్జాతీయ క్రికెట్‌లోనైనా, ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్‌లోనైనా డబుల్ సూపర్ ఓవర్ జ‌ర‌గ‌డం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటిది ఓ టోర్నీలో ఏకంగా మూడు సూప‌ర్ ఓవ‌ర్లతో మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది.. అవును మీరు విన్నది నిజమే.

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా శుక్రవారం హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్లతో తేలింది. 

చివరవరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో  హుబ్లీ టైగర్స్ విజయం సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సూపర్ ఓవర్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది.  హుబ్లీ టైగర్స్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ మ‌నీష్ పాండే(33) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ కూడా నిర్ణీత ఓవ‌ర్ల‌లో స‌రిగ్గా 9 వికెట్లు కోల్పోయి 164 ప‌రుగులే చేసింది. 

దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారితీసింది. బెంగళూరు బ్లాస్టర్స్ కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌ 54 ప‌రుగులతో రాణించాడు. ఇక తొలి సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

మ‌యాంక్ అగ‌ర్వాల్ గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిర‌గ‌గా.. అనిరుద్ జోషీ 8 పరుగులు చేశాడు. అనంత‌రం బెంగళూరు బ్లాస్టర్స్ కూడా మ‌ళ్లీ ప‌రుగులు చేసింది. దీంతో రెండో సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించ‌వ‌ల‌సి వ‌చ్చింది. ఈసారి రెండో సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ 8 పరుగులు చేయగా.. బెంగళూరు బ్లాస్టర్స్ కూడా 8 పరుగులే చేసింది.

దీంతో మ‌ళ్లీ స్కోర్ స‌మం కావ‌డంతో మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చ‌డానికి మూడో సూప‌ర్ నిర్వ‌హించారు. మూడో సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 12 ప‌రుగులు చేసింది. అనంత‌రం హుబ్లీ టైగర్స్ 13 ప‌రుగులు చేసి చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement