ఐపీఎల్‌ ఆడకుండా క్రికెటర్లను ఆపలేం.. ఎందుకంటే! | Aaqib Javed Says Difficult To Stop Players From Going To IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్‌ మాజీ పేసర్‌

Published Mon, Apr 12 2021 3:48 PM | Last Updated on Mon, Apr 12 2021 6:47 PM

Aaqib Javed Says Difficult To Stop Players From Going To IPL - Sakshi

పాక్‌ మాజీ పేసర్‌ ఆకిబ్‌ జావేద్‌(ఫొటో కర్టెసీ: ట్విటర్‌)

ఇస్లామాబాద్‌: కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆడకుండా క్రికెటర్లను కట్టడి చేయలేమని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ ఆకిబ్‌ జావేద్‌ అభిప్రాయపడ్డాడు. దేశం తరఫున ఆడేకంటే, ఇలాంటి రిచ్‌ లీగ్‌లలో ఆడటం ద్వారా ఆర్థికంగా లబ్ది పొందుతారు కాబట్టే, వాటి వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌ జట్టు, మూడు వన్డే, నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న పాక్‌, టీ20 సిరీస్‌లోనూ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. 

మరోవైపు, ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఆడేందుకు గానూ, ప్రొటిస్‌ ఆటగాళ్లు క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌, కగిసొ రబడ వంటి ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ కోసం జాతీయ జట్టు ప్రయోజనాలు పణంగా పెడతారా అంటూ, పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి.. ‘‘నేషన్‌ ఆర్‌ లీగ్‌’’ మ్యాచ్‌ డిబేట్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆకిబ్‌ జావేద్‌ క్రికెట్‌ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌(బీసీసీఐ) వలె ఐపీఎల్‌ ఎంతో శక్తిమంతమైన లీగ్‌. ఒప్పందం కుదిరిన తర్వాత తమ ఆటగాళ్లను అక్కడికి పంపనట్లయితే, ఇతర బోర్డులు వారికి భారీ మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది. 

నిజానికి ఐపీఎల్‌ ఆడటం ద్వారా, నెలన్నరలోనే ఒక్కో ఆటగాడు సగటున 1.5 మిలియన్‌ డాలర్లు సంపాదించే అవకాశం ఉంటుంది. జాతీయ జట్టుకు ఆడితే వస్తే మొత్తం కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్‌ ఇప్పటికే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న సమయంలో ఆటగాళ్లను పంపకుండా ఉండటం దాదాపు అసాధ్యం’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై ప్రశంసలు కురిపించిన ఆకిబ్‌.. తమ జట్టు బౌలర్‌ షాహిన్‌ షా ఆఫ్రిది కంటే ఎంతో డెత్‌ ఓవర్లలో ఎంతో మెరుగ్గా బౌలింగ్‌ చేస్తున్నాడని కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్‌పై పాక్‌ ఆటగాళ్ల అభిప్రాయాల పట్ల భారత అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు. పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.

చదవండి: ఐపీఎల్‌ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?!
‘మిస్టరీ గర్ల్‌’ మళ్లీ వచ్చింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement