
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో ఇవాళ (అక్టోబర్ 27) శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్‌ఫర్ (4-0-14-2) సత్తా చాటడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు.
అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జుబైద్ అక్బరీ (0), కెప్టెన్ దర్విష్ రసూలీ (24) ఔట్ కాగా.. సెదికుల్లా అటల్ (19), కరీం జనత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాంటే మరో 72 బంతుల్లో 87 పరుగులు చేయాలి.