మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైంది. మ్యాచ్‌కు ముందు రోజు భారత శిబిరంలో కరోనా కేసు వెలుగుచూడడం కారణంగా టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు సుముఖంగా లేరని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనలో తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకుంటుందని(forfeit the match) ప్రకటించిన ఈసీబీ.. ఆ వెంటనే మాట మార్చి ఆ పదాన్ని తొలగించి మరో ప్రకటన విడుదల చేసింది.
కాగా, జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసులు అధికమవుతాయన్న కారణంగా టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్‌లో ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లు మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సిరీస్ ఫలితంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ అంశం ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ తెలిపారు.
చదవండి: టీమిండియా ఫిజియోకు కరోనా.. ఆఖరి టెస్ట్ అనుమానమే..?
Comments
Please login to add a commentAdd a comment