లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర ఆటగాళ్లు ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడమే. వీరు బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల అనుమతి తీసుకోకుండా ఆ ఈవెంట్‌కు వెళ్లడంతో తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత వరుసగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్‌లు కరోనా బారిన పడ్డారు. ఐదో టెస్ట్‌కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు సైతం కరోనా నిర్ధారణ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు.
దీంతో ఈ పరిస్థితి రావడానికి హెడ్ కోచ్ రవిశాస్త్రినే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన తొలిసారి స్పందించాడు. తాజాగా ఆయన ఓ ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడుతూ.. యూకే మొత్తం బార్లా తెరిచుండగా నా వల్లే కోవిడ్ వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనని తనను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగాడు. ఆంక్షలు పూర్తిగా సడలించారు.. ప్రజలంతా స్వేచ్చగా తిరుగుతున్నారు. జరిగేది ఉంటే తొలి టెస్ట్ నుంచే ఏదైనా జరిగి ఉండవచ్చుంటూ తన చర్యను సమర్ధించుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన టీమిండియా ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం టీమిండియా ఇంగ్లండ్‌పై దాదాపు గెలిచినంత పనిచేసిందన్నాడు. గతంలో ఇదే పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత జట్టు అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఏ ఇతర జట్టు కూడా టీమిండియాలా ఆడలేదని ఆకాశానికెత్తాడు.
చదవండి: కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..!
Comments
Please login to add a commentAdd a comment