ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హిట్‌మ్యాన్ ముంబై ఇండియన్స్‌ను వీడతాడా? లేదంటే అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతాడా? అంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రోహిత్ ముంబై జట్టుతో బంధం తెంచుకుంటాడని గట్టిగా వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పూర్వపు జట్టుతోనే ప్రయాణం కొనసాగిస్తాడని అంచనా వేశాడు. ఒక దశకు చేరుకున్న తర్వాత.. రోహిత్ వంటి ఆటగాళ్లు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ ఇలా ఆలోచిస్తే తప్పేం ఉంది?
నేను సంతోషంగా ఈ జట్టుతోనే ఉంటాను అనుకుంటే..
‘నాకు కొత్తగా ఎలాంటి తలనొప్పులు వద్దు. నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో ఏళ్లు సారథ్యం వహించాను. ఒకవేళ ఇప్పుడు నేను కెప్టెన్ కాకపోయినంతమాత్రాన ఏం మారుతుంది? నేను సంతోషంగా ఈ జట్టుతోనే ఉంటాను’ అని రోహిత్ భావించవచ్చు. తారస్థాయికి చేరిన తర్వాత కొంతమందికి డబ్బుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
రోహిత్‌ను తప్పించి.. హార్దిక్‌కు పగ్గాలు
కాగా ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరిన ఈ ముంబై బ్యాటర్.. 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2023 వరకు సారథిగా కొనసాగాడు. అయితే, ఈ ఏడాది వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్‌కు పగ్గాలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో రోహిత్‌కు- ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి విభేదాలు వచ్చాయని.. అతడు వచ్చే ఏడాది జట్టును వీడబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గెలవాలన్న దాహం తీరదు
అయితే, ఇటీవల క్రీడా పురస్కారాల వేడుకకు హాజరైన రోహిత్ శర్మ.. తనలో ట్రోఫీలు గెలవాలనే దాహం ఇంకా తీరలేదన్నాడు.. ఒక్కసారి గెలుపు రుచి చూసిన వాళ్లు అంత తేలికగా సవాళ్లకు తలొగ్గరని.. ముందుకు సాగుతూనే ఉంటారని పేర్కొన్నాడు. కాగా ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్(2024) ట్రోఫీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు హిట్‌మ్యాన్.
చదవండి: టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది.. జై షానే కారణం: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment