బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి.. పాకిస్తాన్‌ చెత్త రికార్డులు | After Test Series Loss To Bangladesh, Pakistan Bags Unwanted Records | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి.. పాకిస్తాన్‌ చెత్త రికార్డులు

Published Tue, Sep 3 2024 6:22 PM | Last Updated on Tue, Sep 3 2024 6:31 PM

After Test Series Loss To Bangladesh, Pakistan Bags Unwanted Records

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య పాకి​స్తాన్‌ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్‌ రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌ కోల్పోవడం పాక్‌కు ఇదే తొలిసారి. తాజా ఓటమితో పాక్‌ స్వదేశంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో (ఆరు ఓటములు, నాలుగు డ్రాలు) విజమనేదే ఎరుగదు. బంగ్లాదేశ్‌, జింబాబ్వే తర్వాత ఈ చెత్త రికార్డు సాధించిన జట్టుగా పాక్‌ రికార్డుల్లోకెక్కింది.

ఈ చెత్త రికార్డుతో పాటు పాక్‌ మరో రెండు చెత్త రికార్డులను కూడా మూటగట్టుకుంది. స్వదేశంలో రెండో సారి ఓ జట్టు చేతిలో క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. 2022-23లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాక్‌ 0-3 తేడాతో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది.

తాజా ఓటమితో పాక్‌ టెస్ట్‌ హోదా కలిగిన పది పాత దేశాల చేతుల్లో సిరీస్‌ కోల్పోయిన (స్వదేశంలో) రెండో జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతంలో బంగ్లాదేశ్‌ మాత్రమే ఈ చెత్త రికార్డును కలిగి ఉంది.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌కు విదేశాల్లో లభించిన మూడో సిరీస్‌ విజయం ఇది. బంగ్లాదేశ్‌ 2009లో వెస్టిండీస్‌లో, 2021లో జింబాబ్వేలో, తాజాగా పాక్‌లో సిరీస్‌ విజయాలు సాధించింది.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్‌ అయూబ్‌ (58), షాన్‌ మసూద్‌ (57), అఘా సల్మాన్‌ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ మిరజ్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.  

అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 26 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. లిటన్‌ దాస్‌ వీరోచితంగా పోరాడి సెంచరీ చేశాడు. దాస్‌కు మెహిది హసన్‌ మిరజ్‌ (78) సహకారం అందించాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షెహజాద్‌ 6 వికెట్లు పడగొట్టాడు.

తదనంతరం బంగ్లా పేసర్లు హసన్‌ మహమూద్‌ (5/43), నహిద్‌ రాణా (4/44), తస్కిన్‌ అహ్మద్‌ (1/40) ధాటికి పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో సైమ్‌ అయూబ్‌ (20), షాన్‌ మసూద్‌ (20), బాబర్‌ ఆజమ్‌ (11), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (43), అఘా సల్మాన్‌ (47) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

పాక్‌ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్‌ హసన్‌ 40, షద్మన్‌ ఇస్లాం 24, షాంటో 38, మొమినుల్‌ హక్‌ 34 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ముష్ఫికర్‌ రహీం 22, షకీబ్‌ అల్‌ హసన్‌ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. పాక్‌ బౌలర్లలో మీర్‌ హమ్జా, ఖుర్రమ్‌ షెహజాద్‌, అబ్రార్‌ అహ్మద్‌, అఘా సల్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement