సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. పాక్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఇవాళ (సెప్టెంబర్ 3) ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐదేసిన మిరజ్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
లిటన్ దాస్ వీరోచిత శతకం
అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 26 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. లిటన్ దాస్ వీరోచితంగా పోరాడి సెంచరీ చేశాడు. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు.
172 పరుగులకే కుప్పకూలిన పాక్
తదనంతరం బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లా
పాక్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 40, షద్మన్ ఇస్లాం 24, షాంటో 38, మొమినుల్ హక్ 34 పరుగులు చేసి ఔట్ కాగా.. ముష్ఫికర్ రహీం 22, షకీబ్ అల్ హసన్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. పాక్ బౌలర్లలో మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment