రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో బంగ్లా పేసర్లు పూర్తి ఆధిపత్యం చలాయించి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా బంగ్లా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు.
ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నహిద్ రాణా నాలుగు, తస్కిన్ అహ్మద్ ఓ వికెట్ తీసి పాక్ పతనాన్ని శాశించారు. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో పేసర్లే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు నేలకూల్చడం ఇదే తొలిసారి.
టార్గెట్ 185
సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకు ఆలౌటై బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. వాతావరణం అనుకూలించకపోవడంతో బంగ్లా జట్టు ఛేదనను ధాటిగా ప్రారంభించింది. నాలుగో రోజు చివరి సెషన్‌లో వర్షం మొదలయ్యే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలవాలంటే మరో 143 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆట చివరి రోజు మిగిలి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. జకీర్ హసన్ (31), షద్మాన్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు.
172 పరుగులకే కుప్పకూలిన పాక్
బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) రెండంకెల స్కోర్లు చేశారు.
అంతకుముందు లిటన్ దాస్ (138) వీరోచితంగా పోరాడి శతకం చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment