చాంపియన్స్ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోయినా... పాక్ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్‌కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.
కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.
ఐసీసీ వార్నింగ్.. దిగి వచ్చిన పాక్
అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను పాక్ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, పాక్ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్.. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.
టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్ భారత్‌కు వెళ్లాలి
అందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్‌లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.
అయితే, భవిష్యత్తులో భారత్‌లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.
చదవండి: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్!
Comments
Please login to add a commentAdd a comment