విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్–1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్ చేరింది.
రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ మధ్య నేడు జరిగే క్వాలిఫయర్–2లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్ జట్టుతో ఆడుతుంది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ ఏడు వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌పై నెగ్గింది.
లయన్స్‌ను వేటాడిన టైటాన్స్
APL 2023 Godavari Titans Beat Uttarandhra Lions By 7 Wickets: ఏపీఎల్ సీజన్–2 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లయన్స్‌ను టైటాన్స్ వేటాడేసింది. లీగ్ పాయింట్ల పట్టికలో రన్‌రైట్‌లో వెనుకబడ్డా... హెడ్‌ఆన్స్‌లో విజయంతో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించిన గోదావరి టైటాన్స్ విజయమే లక్ష్యం అన్నంతగా రెచ్చిపోయింది. ఉత్తరాంధ్ర లయన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫైయర్స్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
మిడిలార్డర్ తడబాటు
టాస్ గెలిచిన గోదావరి టైటాన్స్.. ఉత్తరాంధ్ర లయన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ గుల్ఫమ్(49) విజయ్ బౌలింగ్‌లో సందీప్‌కు క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోయాడు. మరో ఓపెనర్ కెప్టెన్ భరత్(37) విజయ్ బౌలింగ్‌లోనే మాధవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వీరి జోడి తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
అయితే శ్యామ్(2), రాహుల్ డకౌట్, తపస్వి(2) విజయ్(8)తో వెనువెంటనే ఔట్ అవ్వడంతో 11 ఓవర్లకు 108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రీనివాస్(12), తేజస్వి(12), రఫీ(17) ఇన్నింగ్స్ కాస్త సరిదిద్దే ప్రయత్నం చేసినా మరో బంతి మిగిలి ఉండగానే 153 పరుగులకు ఆలౌటైంది. శశికాంత్, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా విజయ్ రెండు, కమిల్ ఓ వికెట్ పడగొట్టాడు.
జ్ఞానేశ్వర్ కెప్టెన్ ఇన్నింగ్స్
ప్రతిగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ ఓపెనర్ మునీష్ డకౌట్ గానే అజయ్‌కుమార్ బౌలింగ్‌లో వాసుకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఓపెనర్ కెప్టెన్ జ్ఞానేశ్వర్‌కు హేమంత్ రెడ్డి తోడై స్కోర్‌ను పరుగులెత్తించారు. రెండో వికెట్‌కు వంద పరుగులను జోడించారు. 124 పరుగుల వద్ద హేమంత్ 71(ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులతో తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అతని స్థానంలో వచ్చిన ధీరజ్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 25 పరుగులకు సరిగ్గా 153 పరుగుల వద్ద ఔటయ్యాడు. తపస్వి ఓవర్‌లో చివరి బంతిని సందీప్ ఎదుర్కొని లాంగాన్ మీదుగా సిక్సర్‌గా తరలించాడు. దీంతో 18 ఓవర్లలో మూడు వికెట్లకు 159 పరుగులు చేసి టైటాన్స్ గెలిచింది. కెప్టెన్ జ్ఞానేశ్వర్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 సాధించి అజేయంగా నిలిచాడు. తపస్వి రెండు, అజయ్‌కుమార్ ఓ వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment