బకూ (అజర్‌బైజాన్): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్ కీలక విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి రౌండ్‌లో నల్ల పావులతో ఆడి అర్జున్ గెలుపు నమోదు చేయడం విశేషం. ఈ గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్‌ను ఓడించాడు. నేడు జరిగే రెండో రౌండ్‌ను అతను ‘డ్రా’గా ముగించినా సరే క్వార్టర్ ఫైనల్ చేరతాడు.
మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌ను నల్లపావులతో ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాకినా (రష్యా)తో జరిగిన ఈ పోరును 48 ఎత్తులో హారిక ముగించింది. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడి డి.గుకేశ్ కూడా విజయాన్ని అందుకున్నాడు.
గుకేశ్ 38 ఎత్తుల్లో వాంగ్ హావో (చైనా)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ మ్యాచ్‌లలో ఫెరెన్స్ బెర్క్స్ (హంగేరీ)– ప్రజ్ఞానంద (45 ఎత్తుల్లో)...ఇయాన్ నెపొమినియాచి (రష్యా)– విదిత్ గుజరాతీ మధ్య (31 ఎత్తుల్లో) జరిగిన తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment