బజ్‌బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ క్రికెట్ ఉనికిని చెరిపే ప్రయత్నం చేస్తున్న ఇంగ్లండ్ జట్టుకు తిక్క కుదిరింది. వారు నమ్ముకున్న బజ్‌బాల్ ఫార్ములా తొలిసారి బెడిసికొట్టింది. ఆసీస్ లాంటి జట్టు ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు బజ్‌బాల్, గిజ్‌బాల్ అంటూ ఓవరాక్షన్‌లు చేయకూడదని ఇంగ్లండ్‌కు తెలిసొచ్చింది.
యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ పరిస్థితి ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా మారింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తిక్క కుదిర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (38) సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఆసీస్ దాదాపుగా చేరుకున్నంత పని చేసింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటై, 7 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది.
311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే అలెక్స్ క్యారీ వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత ఖ్వాజా.. కమిన్స్ సాయంతో ఆసీస్ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆఖర్లో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 386 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment