IND VS PAK Super 4 Match: ఆసియా కప్-2022 సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (సెప్టెంబర్ 4) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. గ్రూప్ దశలో ఓసారి ఎదురెదురు పడి కత్తులు దూసుకున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాక్‌లు మరోసారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో పాక్.. పసికూన హాంగ్‌కాంగ్‌పై భారీ విజయం సాధించి, టీమిండియాతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అన్న సంకేతాలు పంపగా.. గ్రూప్ దశలో పాక్‌ను మట్టికరించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా ఉరకలేస్తుంది.
ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యూహరచనలతో కుస్తీ పడటంతో పాటు ప్రాక్టీస్‌లో చమటోడుస్తున్నారు. మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీర లెవెల్లో సాధన చేస్తూ కనిపించాడు. ముఖానికి ప్రత్యేక స్పోర్ట్స్ మాస్క్ (హై అల్టిట్యూడ్ మాస్క్) పెట్టుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మాస్క్ పెట్టుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే శ్వాస కండరాలను బలోపేతం కావడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. యూఏఈలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి మాస్క్‌తో సాధన ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా కాపాడుతుందని కోహ్లి భావిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, చాలాకాలం తర్వాత కోహ్లి ఇటీవలే తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రన్ మెషీన్.. ఆతర్వాత హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లాసీ ఫిఫ్టి కొట్టి పూర్వవైభవం సాధించినట్లు కనిపించాడు. కోహ్లి ఇదే ఫామ్‌ను రేపు పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్‌లో వినూత్న సాధన చేస్తున్నాడు. కోహ్లి పాక్‌పై భారీ ఇన్నింగ్స్, వీలైతే సెంచరీ సాధించాలని అతని అభిమానులు దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.
చదవండి: భార్యతో కలిసి ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేసిన కోహ్లి.. ధర ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment