Photo Credit: Twitter
ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ఒమన్ క్రికెట్ జట్టు సరికొత్త ఫీట్ నమోదు చేసింది. ఆట పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, జట్టు కూర్పు పరంగా మాత్రం ఒక గమ్మత్తైన విషయం బయటికి వచ్చింది. ఒమన్ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లకు ఒకే ఇంటిపేరు ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఒమన్ తుది జట్టులోని పదకొండు మందిలో ఒకే ఇంటిపేరున్న ఏడుగురు ఆటగాళ్లు మ్యాచ్‌లో ఆడడం మరో విశేషం.
శుక్రవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్ కోసం.. సుఫ్యాన్ మహమూద్ కెప్టెన్‌గా వ్యవహరించిన జట్టులో మహమ్మద్ అల్ బలూషి, షుఐబ్ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి, ఈసా అల్ బలూషి, నవీద్ అల్ బలూషి, ఫారిస్ అల్ బలూషి మ్యాచ్ ఆడారు. వీరితో పాటు బెంచ్‌పై ఉన్న వసీం, ఖైస్‌ల ఇంటిపేరు కూడా అల్ బలూషినే కావడం గమనార్హం.
ఒమన్ జట్టు తరఫున అల్ బలూషి పేరున్న నలుగురు ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్‌కు రావడం విశేషం. మహమ్మద్ అల్ బలూషి, ఐబ్ అల్ బలూషి ఓపెనర్లుగా రాగా.. జుబైద్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి మూడు, నాలుగు స్థానాల్లో వచ్చారు. క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఇంటిపేరున్న నలుగురు ఆటగాళ్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం ఇదే మొదటిసారి.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ముహమ్మద్ హఫీజ్ (33), బాబర్ హయత్ (23) రాణించారు. ఒమన్ బౌలర్లలో మొహమ్మద్ అల్ బలూషి 3 వికెట్లు తీశాడు. అనంతరం ఒమన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 80 పరుగులకే పరిమితమైంది. సుఫ్యాన్ మెహ్మూద్ (26) టాప్ స్కోరర్. ఆయుశ్ శుక్లా మూడు వికెట్లతో రాణించాడు.
ఇదీ చదవండి: కలిసొచ్చిన శనివారం.. 30 పతకాల మార్క్ దాటిన భారత్


