ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది.
అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్‌తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment