అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ శతకం మ్యాక్సీకి టీ20ల్లో ఐదవది. పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని సెంచరీలు చేశాడు.
మ్యాక్సీ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ధాటిగానే ఆడుతున్నప్పటికీ ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
బ్రాండన్ కింగ్ (5), జాన్సన్ చార్లెస్ (24), పూరన్ (18), హోప్ (0), రూథర్‌ఫోర్డ్ (0) ఔట్ కాగా.. రోవ్‌మన్ పావెల్ (13), రసెల్ (30) క్రీజ్‌లో ఉన్నారు. 13 బంతుల్లోనే 30 పరుగులు చేసిన రసెల్ మాంచి ఊపుమీదున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్, స్పెన్సర్ జాన్సన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
వారంతా ఒకవైపు.. మ్యాక్స్‌వెల్ ఒక్కడే ఒకవైపు
టీ20ల్లో ఐదో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంతా కలిసి సాధించినన్ని సెంచరీలను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా చేశాడు. టీ20ల్లో ఆసీస్ క్రికెటర్లంతా కలిపి ఐదు శతకాలు చేయగా.. మ్యాక్సీ ఒక్కడే ఐదేశాడు.
పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్‌వెల్ తర్వాత ఆరోన్ ఫించ్ అత్యధికంగా రెండు సెంచరీలు చేయగా.. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, జోష్ ఇంగ్లిస్ తలో సెంచరీ బాదారు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున మొత్తం 95 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించగా.. కేవలం కేవలం ఐదుగురు మాత్రమే సెంచరీలు చేశారు. మిగతా నలుగురు చేసిన సెంచరీలను మ్యాక్సీ ఒక్కడే చేయడం విశేషం.
అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్‌వెల్ చేసిన సెంచరీలు..
- 145 (65)vs శ్రీలంక
- 120(55) vs వెస్టిండీస్
- 113(55) vs ఇండియా
- 104(48) vs ఇండియా
- 103(58) vs ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment