పొట్టి క్రికెట్‌లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో రసెల్, రూథర్‌ఫర్డ్ జోడీ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది.
ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్‌లో పపువా జోడీ ఆరో వికెట్‌కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ జోడీ (మైక్ హస్సీ-కెమరూన్ వైట్) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హస్సీ-వైట్ కాంబో ఆరో వికెట్‌కు అజేయమైన 101 పరుగులు జోడించింది.
ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక విండీస్ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్‌ను గెలిపించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్, రూథర్‌ఫోర్డ్‌తో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment