కేప్‌టౌన్ టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలిచి జోష్ మీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చాలాకాలం తర్వాత భారత జట్టు టెస్ట్‌ల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో (2-0) ఆస్ట్రేలియా భారత్‌ను కిందకు దించి ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. కేప్‌టౌన్ టెస్ట్‌లో భారత్ గెలుపొందినా.. సిరీస్ డ్రా (1-1) కావడంతో రోహిత్ సేన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలుపుతో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానానికి చేరిన భారత్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పరాభవాన్నిమరువకముందే ఆసీస్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టింది.
అయితే టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం ఆసీస్‌కు మూన్నాళ్ల ముచ్చటగానే మిగలవచ్చు. త్వరలో భారత్.. ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుండటంతో ర్యాంకింగ్స్‌లో మార్పులకు తప్పక ఆస్కారం ఉంటుంది. ఆసీస్, భారత్‌ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కూడా చాలా తక్కువగా (1) ఉండటంతో ర్యాంకింగ్స్ తారుమారు కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. భారత్ 117 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల తర్వాత మూడో స్థానంలో ఇంగ్లండ్ (115), నాలుగో ప్లేస్‌లో సౌతాఫ్రికా (106), ఐదో స్థానంలో న్యూజిలాండ్ (95), ఆరో స్థానంలో పాకిస్తాన్ (92), ఏడో స్థానంలో శ్రీలంక (79), ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్ (77), తొమ్మిదో ప్లేస్‌లో బంగ్లాదేశ్ (51), పదో స్థానంలో జింబాబ్వే (32) జట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment