టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్‌కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.
అయితే ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.
ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్‌వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.
అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్‌కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్‌సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.
కాగా ఈ నామమాత్రపు సిరీస్‌కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.
అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్‌కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్‌తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్‌ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?
Comments
Please login to add a commentAdd a comment