టీమిండియాతో ఆఖరి టెస్ట్‌.. ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు..? | Australia Probable XI For Sydney Test | Sakshi
Sakshi News home page

టీమిండియాతో ఆఖరి టెస్ట్‌.. ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు..?

Published Wed, Jan 1 2025 6:01 PM | Last Updated on Wed, Jan 1 2025 6:11 PM

Australia Probable XI For Sydney Test

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగబోయే చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనుందని తెలుస్తుంది. ఫామ్‌లో లేని మిచెల్‌ మార్ష్‌పై వేటు పడే అవకాశం ఉందని సమచారం. పక్కటెముకల సమస్యతో బాధపడుతున్న స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌కు విశ్రాంతినిస్తారని తెలుస్తుంది. 

మ్యాచ్‌ సమయానికి స్టార్క్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే తుది జట్టులో ఉంటాడు. లేదంటే అతని స్థానంలో జై రిచర్డ్‌సన్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. రిచర్డ్‌సన్‌ గాయపడిన హాజిల్‌వుడ్‌ స్థానంలో జట్టులోకి వచ్చాడు. 

మార్ష్‌ విషయానికొస్తే.. అతను ఫామ్‌ లేమితో పాటు ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుత బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో మార్ష్‌ ఎక్కువగా బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. అతను పెద్దగా బౌలింగ్‌ చేయలేదు. మార్ష్‌ ఈ సిరీస్‌ 10.43 సగటున కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. 

మిడిలార్డర్‌లో మార్ష్‌ ఆసీస్‌కు పెద్ద సమస్యగా మారాడు. అందుకే అతనిపై వేటు పడనుందని తెలుస్తుంది. ఆఖరి టెస్ట్‌లో మార్ష్‌ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్‌ తుది జట్టులోకి వస్తాడని సమాచారం​. పై రెండు మార్పులతో ఆసీస్‌ చివరి టెస్ట్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

భారత్‌తో ఐదో టెస్ట్‌కు ఆసీస్‌ తుది జట్టు (అంచనా)..
ఉస్మాన్‌ ఖ్వాజా, సామ్‌ కొన్‌స్టాస్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌, బ్యూ వెబ్‌స్టర్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌ (ఫిట్‌గా ఉంటేనే) లేదా జై రిచర్డ్‌సన్‌, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలాండ్‌

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రా కాగా.. తాజాగా మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement