బ్రిస్బేన్: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఆసక్తికర వైరానికి మరోసారి తెర లేవనుంది. ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ కోసం ఆసీస్ గడ్డపై రంగం సిద్ధమైంది. నేటి నుంచి ‘గాబా’ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2019లో ఇరు జట్ల మధ్య ఇంగ్లండ్‌లో చివరిసారి జరిగిన యాషెస్ సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే అంతకుముందు 2017లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4–0తో చిత్తుగా ఓడించిన కారణంగా ఆసీస్ గత యాషెస్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ టీమ్ ఆఖరిసారిగా 2010–11 సీజన్‌లో కంగారూలను వారి గడ్డపైనే ఓడించగలిగింది. 33 యాషెస్ సిరీస్‌లలో ఆస్ట్రేలియా... 32 సిరీస్‌లలో ఇంగ్లండ్ గెలిచిన నేపథ్యంలో మరోసారి సమఉజ్జీల మధ్య హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది. జనవరి 14–18 మధ్య జరిగే ఐదో టెస్టుతో సిరీస్ ముగుస్తుంది.
కెప్టెన్లకు సవాల్...
ఇరు జట్ల కెప్టెన్లకు సంబంధించి కూడా తాజా ‘యాషెస్’ కీలకంగా మారింది. 1956 తర్వాత తొలిసారి ఒక ఫాస్ట్ బౌలర్ ఆసీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ అటు ప్రధాన బౌలర్‌గా సత్తా చాటడంతో పాటు జట్టును నడిపించాల్సిన కీలక బాధ్యత అతనిపై ఉంది. వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ రూపంలో అతనికి సహకారం లభించనుండటం కొంత సానుకూలాంశం. ఆసీస్ ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. టిమ్ పైన్ ఆట నుంచి విరామం తీసుకున్న నేపథ్యంలో అలెక్స్ క్యారీ వికెట్ కీపర్‌గా ఈ టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ గెలవాలంటే కెప్టెన్ రూట్ భారీగా పరుగులు సాధించాల్సి ఉంది. ఆసీస్ గడ్డపై అతని రికార్డు ఇప్పటి వరకు గొప్పగా లేదు. 17 ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రూట్ ఇక్కడా చెలరేగాల్సి ఉంది. డే అండ్ నైట్‌గా జరిగే రెండో టెస్టు (అడిలైడ్) కోసం తగిన రీతిలో సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లండ్ తమ ప్రధాన పేసర్ అండర్సన్‌కు ఈ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చింది. చాలా రోజుల తర్వాత స్టోక్స్ పునరాగమనం చేయనుండటంతో ఇంగ్లండ్ బలం పెరిగింది. మరో వికెట్ తీస్తే ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లయోన్... వార్న్, మెక్‌గ్రాత్ తర్వాత 400 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో ఆసీస్ బౌలర్‌గా నిలుస్తాడు.
AUS vs ENG Ashes Series: ‘యాషెస్’ సమయం.. 1956 తర్వాత మళ్లీ ఇప్పుడే
Published Wed, Dec 8 2021 5:42 AM | Last Updated on Wed, Dec 8 2021 9:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment