England Vs Australia, 5th Test: Australia A Record Target To Win The Fifth Ashes Test - Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఇంగ్లండ్‌ 

Published Sun, Jul 30 2023 2:33 AM | Last Updated on Mon, Jul 31 2023 7:37 PM

Australia a record target to win the fifth Ashes Test  - Sakshi

లండన్‌: తొలి రోజునుంచే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌లో మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధమైంది. చివరిదైన ఐదో టెస్టును గెలుచుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్‌ బలంగా పట్టు బిగించింది. పదునైన బ్యాటింగ్‌తో చెలరేగి ఆస్ట్రేలియా ముందు దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచేందుకు సిద్ధమైంది.

మ్యాచ్‌ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అండర్సన్‌ (8 బ్యాటింగ్‌), బ్రాడ్‌ (2 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 377 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు రోజులు ఆసీస్‌ బ్యాటర్లు నిలబడి లక్ష్యాన్ని ఛేదిస్తారా లేక ఇంగ్లండ్‌ 2–2తో సిరీస్‌ను సమం చేస్తుందా చూడాలి.  

ఇంగ్లండ్‌ మరోసారి తమ బ్యాటింగ్‌లో తొలి బంతినుంచే ‘బజ్‌బాల్‌’ దూకుడును ప్రదర్శించింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (76 బంతుల్లో 73; 9 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (55 బంతుల్లో 42; 7 ఫోర్లు) ఎప్పటిలాగే ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 17 ఓవర్లలోనే 79 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచి్చన కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (67 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా జోరు తగ్గకుండా బ్యాటింగ్‌ కొనసాగించాడు.

అనంతరం జో రూట్‌ (106 బంతుల్లో 91; 11 ఫోర్లు, 1 సిక్స్‌), జానీ బెయిర్‌స్టో (103 బంతుల్లో 78; 11 ఫోర్లు) ఇన్నింగ్స్‌లు ఇంగ్లండ్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చాయి. రూట్, బెయి ర్‌స్టో ఐదో వికెట్‌కు 110 పరుగులు జత చేశారు. 2019లోనూ ఇంగ్లండ్‌ గ డ్డపై జరిగిన ‘యాషెస్‌’ సిరీస్‌ 2–2తో సమంగా ముగిసింది. ఇరు జట్లు చెరో 2 టెస్టులు గెలవగా, మరో టెస్టు ‘డ్రా’ అయింది. ఆ తర్వాత 2021లో తమ సొంతగడ్డపై జరిగిన ‘యాషెస్‌’లో ఆ్రస్టేలియా 4–0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.  

‘దెమెంతియా’ బాధితులకు మద్దతుగా... 
మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు భిన్నమైన రీతిలో దెమెంతియా (మతిమరపు) వ్యాధిగ్రస్తులకు సంఘీభావం ప్రకటించారు. ప్రతీ ఆటగాడు తమ పేరు రాసి ఉన్న జెర్సీ కాకుండా జట్టులోని మరో సభ్యుడి జెర్సీని ధరించి మైదానంలోకి దిగారు. మతిమరపు కారణంగా తమ వస్తువులను గుర్తించడంలో గందరగోళానికి గురి కావడం ‘దెమెంతియా’ లక్షణాల్లో ఒకటి.  బ్రాడ్‌ పేరుతో అండర్సన్, స్టోక్స్‌ పేరుతో బెయిర్‌స్టో, వోక్స్‌ పేరుతో అలీ...ఇలా ఆటగాళ్లు టీ షర్ట్‌లు ధరించి ఆడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement