Photo Courtesy: ICC
2022 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా టెస్ట్ సారధి పాట్ కమిన్స్, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చోటు దక్కించుకున్నారు. గత నెలలో ఆసీస్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ముందుండగా.. రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన ఆసీస్ సారధి పాట్ కమిన్స్, ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 78 సగటున 390 పరుగులు చేసిన పాక్ కెప్టెన్.. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెచ్చిపోయాడు. 3 వన్డేల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించి తన జట్టుకు ఒంటిచేత్తో సిరీస్ విజయాన్నందించాడు. సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టీ20లో సైతం చెలరేగిన బాబర్.. మరో హాఫ్ సెంచరీ బాది కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
ఇదే సిరీస్‌లో ఆసీస్ స్కిప్పర్ పాట్ కమిన్స్ ఆఖరి టెస్ట్‌లో 8 వికెట్లు సాధించి, తన జట్టు చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ సిరీస్‌లో మొత్తం 12 వికెట్లు సాధించిన కమిన్స్.. సిరీస్ ఆధ్యాంతం జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ సారధి బ్రాత్‌వైట్.. సిరీస్‌లో భాగంగా జరిగిన 3 టెస్ట్‌ల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 85.25 సగటున 341 పరుగులు చేశాడు. బ్రాత్‌వైట్ సంచలన ప్రదర్శన కారణంగా విండీస్.. పర్యాటక ఇంగ్లండ్ జట్టును ఖంగుతినిపించి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment