BAN VS IRE 2nd ODI: Mushfiqur Rahim Scores Fastest Century - Sakshi
Sakshi News home page

Mushfiqur Rahim: ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు

Published Mon, Mar 20 2023 6:23 PM | Last Updated on Mon, Mar 20 2023 8:45 PM

BAN VS IRE 2nd ODI: Mushfiqur Rahim Scores Fastest Century - Sakshi

BAN VS IRE 2nd ODI: సిల్హెట్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ వెటరన్‌ ముష్ఫికర్‌ రహీం సునామీ శతకం సాధించాడు. కేవలం 60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన ముష్ఫికర్‌.. వన్డేల్లో బంగ్లాదేశ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు షకీబ్‌ పేరిట ఉండేది. 2009లో షకీబ్‌ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 

ఈ క్రమంలో బంగ్లా టైగర్స్‌ వన్డేల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు కూడా నెలకొల్పారు. ముష్ఫికర్‌ మెరుపు సెంచరీతో పాటు లిటన్‌ దాస్‌ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్‌ హ్రిదొయ్‌ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది.  

వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోర్‌. రోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్‌ అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఇదే సిరీస్‌లో మార్చి 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌.. 2 రోజుల గ్యాప్‌లోనే రికార్డును మెరుగుపర్చుకుంది.

6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్‌లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. తద్వారా తమీమ్‌ ఇక్బాల్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.  

ఈ సెంచరీతో ముష్ఫికర్‌ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తమీమ్‌ ఇక్బాల్‌ 14 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ముష్ఫికర్‌ (9), షకీబ్‌ (9)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.  

కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్‌ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్‌ ఇన్నిం‍గ్స్‌ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement