
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి రావాల్పండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌కు ఆగస్టు 17న పాక్‌కు బంగ్లా క్రికెట్ జట్టు పయనం కానుంది. అయితే పాక్ టూర్ వెళ్లేముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టూర్ కోసం ఓ భద్రతా సలహాదారుని నియమించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీసీబీ అభ్యర్ధించింది.
"పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే మా జట్టు భద్రతపై మేము కొద్దిపాటి ఆందోళన చెందుతున్నాము. అయితే భద్రతకు సంబంధించి పూర్తి స్థాయి భరోసా పీసీబీ నుంచి లభించడంతోనే మా జట్టు పాక్‌కు వెళ్లనుంది. ఏదమైనప్పటికి ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదే.
ఆసియా కప్ కోసం అక్కడకు వెళ్లిన మా జట్టుకు రాష్ట్ర స్థాయి భద్రత లభించింది. పాక్‌లో పర్యటించిన ఇతర జట్లకు చేసిన భద్రతా ఏర్పాట్లపై కూడా మేము సంతృప్తిగా ఉన్నాము. అయితే భద్రతా సమస్యలకు సంబంధించి వారితో ఎల్లప్పుడూ చర్చించేందుకు ఒక సెక్యూరిటీ కన్సల్టెంట్‌ను నియమించమని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని" బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నాడు.